కడ్తాల్, ఆగస్టు 17 : రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బహుజనుల రాజ్యాధికారం కోసం నాలుగు వందల సంవత్సరాల క్రితమే పోరాడిన ధీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలో ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలంతోపాటు, రూ.3 కోట్ల నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.
పాపన్నగౌడ్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ సర్కార్ వెంటనే పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, తెలంగాణలో మూతపడిన కల్లు గీత సొసైటీలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 25 శాతం వైన్స్, బార్లను కల్లు గీత సొసైటీలకు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతిని సర్వాయి పాపన్న చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, ఏఎంసీ చైర్పర్సన్ గీత, జైగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు రామారావుగౌడ్, టాస్క్ సీఈవో రాఘవేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు, నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.