హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ) : కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తున్నదని, అదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగే మారే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆల్మట్టి పెంపును అడ్డుకోవాల్సిన రేవంత్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, పాలమూరు బిడ్డనని పదేపదే చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి దానిని వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తితో కలిసి గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి భూసేకరణకు కర్ణాటక ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
ఆ ప్రాజెక్టు ఎత్తుపెంచితే పాలమూరుతోపాటు నల్లగొండ జిల్లాకు కూడా చుక్కనీరు రాదని, తద్వారా రెండు జిల్లాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని వీడి కండ్లు తెరిచి కర్ణాటక ప్రయత్నాలను నిలువరించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి అల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ సమాజం దృష్టిలో శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎగువ నుంచి గోదావరి, కృష్ణా నదుల్లో వస్తున్న వరదనీటిని ఒడిసిపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. కరువు ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కనూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని కోరారు.
పాలమూరు జిల్లాకు కృష్ణా, తుంగభద్ర, భీమా నదులే ఆధారమని వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాలకు వస్తున్న వరదనీటిని అనాలోచితంగా దిగువకు వదులుతున్నారని దుయ్యబట్టారు. సాగును విస్మరించి తాగునీటి అవసరాలకే నిల్వ చేసుకోవాలని చూడటం శోచనీయమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే కారణంతో కన్నెపల్లి మోటర్లను ఆన్ చేయకపోవడం దుర్మార్గమని, మరి కేసీఆర్ నిర్మించిన లిఫ్ట్‌లతో ఎల్లంపల్లి నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోస్తున్నారు?అని ప్రశ్నించారు.
కేసీఆర్‌పై కుట్రతోనే కాంగ్రెస్ సర్కార్ పాలమూరు, కాళేశ్వరం పంపులను నడుపడం లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు కోరిక మేరకు ఆంధ్రా ప్రజలకు మేలు చేసేందుకే కృష్ణా, గోదావరి నదుల్లోని వరదనీటిని దిగువకు వదిలిపెడుతూ తెలంగాణ ప్రజలను బలిపెడుతున్నారని మండిపడ్డారు. రామన్నపాడు రిజర్వాయర్‌లో నీళ్లు ఎందుకు నింపడంలేదని ప్రశ్నిం చారు. వెంటనే పంపులన్నీ ఆన్‌చేయాలని డిమాండ్ చేశారు. సాగునీరందించడంపై ఆంక్షలను విరమించుకోకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.