మహబూబ్‌నగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసేలేదని, ఇది అన్ని వర్గాలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బడ్జెట్‌పై మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ. లక్ష కోట్లు ఇస్తామని.. ఇప్పుడు 3.85 శాతం మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. బీసీలకు రూ.50 వేల కోట్లు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గురుకులాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పిందని, ఉద్యోగులకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని, ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. రైతు సంక్షేమాన్ని విస్మరించారని, రైతుభరోసా ఇవ్వడంలేదని ఆరోపించారు.