హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): మంత్రుల సవాల్ స్వీకరించి చర్చించేందుకు వస్తే అరెస్ట్ పేరిట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి బాత్రూమ్ల వద్ద ఎండలో కూర్చోబెట్టడం ఏంటీ..? అని పోలీసుల తీరుపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 30నెలల వైఫల్యాలపై చర్చించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతిపై చర్చిద్దామని ప్రకటిస్తే, మం త్రులు భయపడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ నేతల నుంచి అందుతున్న ఆదేశాల మేరకే పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 30 నెలల్లో చేసిన అప్పు ఎటూ వెళ్లిందని ప్రశ్నించారు. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చాక నిర్మించిన ఒక్క ప్రాజెక్టు, పూర్తిగా అమలైన స్కీమ్‌ను చూయించాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర వద్ద రిపేర్ అయిన గేట్‌ను సీఎం రేవంత్ వెళ్లి ఓపెన్ చేసి వచ్చారని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చి ఉంటే లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి కదా..? అని ప్రశ్నించారు.