కృష్ణానదిని చెరబట్టి, దక్షిణ తెలంగాణకు ఉరి బిగించేందుకు కేంద్రంలోని బీజేపీ, కర్ణాటకలోని కాంగ్రెస్, ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలు.. వాటితో కలిసి రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను ‘దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఉరి!’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం రాష్ట్ర రాజకీయవర్గాలు, సాగునీటి రంగంలో సంచలనం సృష్టించింది.
పాలమూరుకు ప్రాణాధారమైన జూరాలను, దక్షిణ తెలంగాణకు జలభాండమైన శ్రీశైలాన్ని బలిపెట్టేందుకు మూడు ప్రభుత్వాలు పన్నిగ పన్నాగం, దానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కూడా సహకరిస్తుండటం నిజమేనని, నమస్తే తెలంగాణ చెప్పింది అక్షరసత్యమని కేంద్ర జల సంఘం, రాష్ట్ర సాగునీటి రంగ నిపుణుల్లోనూ చర్చకు వచ్చింది. ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి తెలంగాణ నలుమూలకూ పారించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలని పదేండ్ల పాటు కేసీఆర్ అహర్నిశలూ శ్రమించి ప్రాజెక్టులు కట్టిస్తే.. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉన్న ప్రాజెక్టులను పండబెట్టి తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ర్టాలకు ధారాదత్తం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
మహబూబ్‌నగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏపీ, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి పాలమూరుకు సీఎం రేవంత్‌రెడ్డి మరణశాసనం లిఖించేందుకు కుట్ర చేస్తున్నాడని మాజీ మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అందుకోసమే మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పర్యటించారని, కృష్ణా, భీమా, తుంగభద్ర నదీ జలాల విషయంలో రాష్ట్రంతోపాటు పాలమూరు జిల్లా ప్రయోజనాలను పక్క రాష్ర్టాలకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, బీఆర్ఎస్ పాదయాత్ర చేపట్టి రేవంత్ సర్కార్‌ను మొద్దునిద్ర నుంచి లేపాలని నిర్ణయించిన క్రమంలో ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పారు.
పీఆర్ఎల్ఐ పనులను పూర్తిచేయడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని తేటతెల్లమైందని విమర్శించారు. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పెండింగ్ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. అదే తమ ప్రభుత్వం ఉండి ఉంటే ఆరు నెలల్లో కరివెన వరకు నీళ్లు తీసుకొచ్చేవారమని చెప్పారు. అన్ని పనులూ చేశాక మిగిలినవి చేయడానికే ఏడాది సమయం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ కోసం 27,000 ఎకరాలు సేకరించామని, లెక్కలు సరిచూసుకోవాలని సూచించారు.
‘ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పెద్ద ప్రాజెక్టుకు భూసేకరణ చేయకుండా ఎలా చేపడుతారని అనుకున్నారు? బీఆర్ఎస్ భూసేకరణ చేయలేదనడం హాస్యాస్పదంగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2014కు ముందు జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందేది. అదే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం’ అని గుర్తుచేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాను బాగుచేసేందుకు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఉద్దండాపూర్ రైతులకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని భావించి పనులు ఆలస్యంగా 2019లో ప్రారంభించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పాలకులు రెండున్నరేండ్లలో రూ.600 కోట్లు పరిహారం ఇచ్చి గొప్పగా చెప్పుకొంటున్నారని విమర్శించారు.
రెండున్నరేండ్ల నుంచీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టారని, జిల్లా పర్యటనకు వచ్చి ప్రాజెక్టును ఎప్పటి వరకు పూర్తి చేస్తారో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా చెప్పలేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చారు కదా.. ఏవైనా వరాలు కురిపిస్తారని జిల్లావాసులు ఆశిస్తే.. వారి ఆశలపై నీళ్లు చల్లారు’ అని విమర్శించారు. జూరాల పరిధిలో కర్ణాటక చెక్‌డ్యామ్ కట్టేందుకు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. ‘కర్ణాటక వైపు వెళ్లిండు.. అక్కడ పనులు.. చెక్‌డ్యామ్‌లు చూసిండు.. దానితో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారిని తీసుకువచ్చి ఏపీకి తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్లే కుట్ర చేస్తున్నరు’ అని నిప్పులు చెరిగారు.
కాలువలు, టన్నెళ్లు, మోటర్లు, పంపుహౌస్, రిజర్వాయర్లు కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని, వాటిలో కనీసం తట్టెడు మట్టిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తలేదని ధ్వజమెత్తారు. ‘పాలమూరు ప్రాజెక్ట్‌లో రూ.33, 500 కోట్ల పని చేశాం.. పెండింగ్ బిల్లులు కొన్ని ఇచ్చి మేము పని చేశామనడం సరికాదు. నాడు కోర్టుల్లో కేసులు వేయించలేదా?’ అని నిలదీశారు.
రూ.20 వేల కో ట్లు ప్రతి ఏడాదికి ఇవ్వాలని సీఎం రేవంత్ క్యాబినెట్‌ను కోరారు. 5 ఏండ్లలో రూ.లక్ష కోట్లను ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలం పాదయాత్ర చేస్తామని చెప్పగానే రెండున్నరేండ్లకు సీఎం ప్రాజెక్ట్ సందర్శన చేశాడని దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సందర్శన సమయంలో చేపట్టాలనుకున్న పనులు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించకుండా కక్షగట్టి రెండున్నరేండ్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమయాన్ని వృథా చేశారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష చేశామని చెప్పారని, ఇందుకు సంబంధించి ప్రెస్ నోట్ ఎందుకు ఇవ్వలేదని, అంత రహస్యంగా సమీక్షించాల్సిన అవసరం ఏమున్నదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.