హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, బీసీ మేధావుల ఫోరం, ఛాత్ర ఆర్జేడీ, ఎస్ఎఫ్డీ, జేఎన్‌యూ రిజర్వేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ‘కులగణన, ఓబీసీ రిజర్వేషన్లు.. రాజ్యంగ పరిరక్షణలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ప్రసంగం చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేసి.. బిల్లుపై గవర్నర్‌తో సంతకం చేయించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు.
వెంటనే సంతకం చేయించి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టామని జబ్బలు చరుచుకుంటే అణగారినవర్గాలకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని చెప్పారు. అసెంబ్లీలో మాదిరిగానే పార్లమెంట్‌లోనూ బీసీ బిల్లు ఆమోదానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. చట్టబద్ధత కోసం రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మోదీ సర్కారుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో, కార్పొరేషన్ పదవుల కేటాయింపుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు.
హెచ్‌సీయూ భూముల పరిరక్షణపై సుప్రీంకోర్టు ఆదేశాలు నియంతృత్వ రేవంత్ సర్కారుకు గుణపాఠమని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు బేషజాలను వీడి, భూముల వేలం ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.