హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రశ్నించిన ప్రతి ఒకరినీ జైల్లో వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నువ్వు జైలుకు వెళ్లినందున కేటీఆర్‌ను కూడా జైల్లో వేయాలని కుట్ర పన్నుతున్నవ్.. ఎంత మందిని జైల్లో వేస్తవ్ రేవంత్‌రెడ్డీ? బీఆర్ఎస్కు 60 లక్షల మంది కార్యకర్తల సైన్యం ఉన్నది. అందర్నీ జైల్లో వేస్తవా?’ అని ప్రశ్నించారు. ‘కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అల్లకల్లోలమే.. రాష్ట్రపతి పాలన వచ్చినా వస్తుంది’ అని హెచ్చరించారు.
‘కేటీఆర్ ఏం తప్పు చేశారని అరెస్టు చేస్తారు? ప్రపంచంలోని ప్రముఖ నగరాలకు పరిమితమైన ఫార్ములా కార్ల రేసింగ్‌ను హైదరాబాద్‌కు తేవడమే కేటీఆర్ చేసిన తప్పా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడమే కేటీఆర్ చేసిన తప్పా?’ అని నిలదీశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తామంటూ రేవంత్ ప్రభుత్వం రెండు నెలలుగా పుకార్లు వ్యాప్తి చేస్తున్నదని మండిపడ్డారు.
ఫార్ములా ఈ-రేసింగ్‌కు సంబంధించి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ ఏసీబీకి అనుమతిచ్చారనే వార్తలు వచ్చాయని తెలిపారు. పారిశ్రామిక, ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా ఈ-రేసింగ్‌ను కొనసాగించకుండా రద్దు చేయడమే రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పని, ఫార్ములా ఈ సంస్థను ప్రోత్సహించేలా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం తప్పుకాదని స్పష్టంచేశారు.
అదానీతో రేవంత్‌రెడ్డి సంబంధాలను బయటపెడుతున్నందుకే కేటీఆర్‌పై కక్ష గట్టారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ప్రజల గొంతుకై పని చేస్తున్నందుకే కేటీఆర్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని నిప్పులుచెరిగారు. చేతనైతే ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టాలిగానీ కక్షసాధింపు రాజకీయాలపై కాదని హితవుపలికారు.