హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగానే ఆయన పేరిట జిల్లా పేరు ప్రకటించాలని కోరారు.
తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవి, రామచంద్రునాయక్, రాంనర్సయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో సీఎంగా కేసీఆర్ నిర్ణయించారని, మూడు కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారని, ఆ మేరకు విగహం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఖిలాషాపూర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దామని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రయత్నం చేసినట్టు తెలిపారు.