హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో కాంట్రాక్టర్లకు బిల్లులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎన్ని చె ల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో పలు యూనివర్సిటీల నేతలు శనివారం సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఐక్య పోరుకు సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
సంపద సృష్టించకుండా, నిధులు లేవని బకాయిలు చెల్లించకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఈ నెల 15న అఖిల పక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలతో సమావేశమై, తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించే అంశంపై కాలయాపన కోసం ఎలాంటి కమిటీలు వేయవద్దని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యాలను కూడా బెదిరించే ప్రయత్నాలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని సూచించారు.
హైదరాబాద్, నవంబర్8 (నమస్తే తెలంగాణ): కమిటీలతో కాలయాపన చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్యపోరుకు సిద్ధమయ్యాయని, ఈ మేరకు 15న కార్యాచరణ ప్రకటిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండేండ్ల తన పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల కోసం ఎన్ని నిధులు కేటాయించింది? చెల్లించింది ఎంత? అన్న అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.