కాచిగూడ, డిసెంబర్ 1: కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రైవేటు బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొస్తే.. వందలాది మంది ఎంపీలు ఉన్నా బీసీ రిజర్వేషన్ల కల్పనకు కృషి చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. 42శాతం బీసీ కోటా అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ల జీవో 46ను రద్దుచేసి రాజ్యాంగ సవరణతో 9వ షెడ్యూల్లో చేర్చాలని, విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో బర్కత్‌పుర గుజరాత్‌భవన్, లింగంపల్లి రోడ్డుపై విద్యార్థులు బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు అన్యాయం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఫీజు బకాయిలు ఇవ్వడంలో సీఎం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, రూ.600 కోట్లు చెల్లించడం గర్హనీయమన్నారు.