ఖైరతాబాద్, ఫిబ్రవరి 26 : గౌడల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, సమస్త ప్రజలకు దివ్య ఔషధాన్ని పంచుతున్న నీరా కేఫ్‌ను ధ్వంసం చేయడం నీచమైన చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఐఐసీటీ లాంటి సంస్థలు, విదేశాలకు చెందిన కొన్ని పరిశోధన సంస్థలు కూడా నీరా ఆరోగ్యకరమైందని తేల్చినట్టు చె ప్పారు. నీరాకేఫ్ తొలగింపును గౌడ కులస్తు లు, వృత్తిపై కాంగ్రెస్ ప్రభుత్వ దాడిగా పరిగణిస్తున్నామని స్పష్టంచేశారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మార్చి 17న ఇందిరాపార్కు వద్ద వేలాది మందితో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. అన్ని కుల వృత్తుల నాయకులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మహాధర్నాలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రెస్‌క్లబ్‌లో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతుండగా విద్యుత్తు సరఫరాకు అంతరా యం ఏర్పడింది. దీంతో ఆయన ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.