ఖైరతాబాద్, జనవరి 5: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులన్నీ ధ్వంసమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నదని, కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గత రెండ్లేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 721 మంది గీత వృత్తిదారులు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు.
అధికారంలోకి వస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు.. నేడు కేవలం రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జిల్లా ఏర్పాటు, గీత వృత్తిదారులకు వైన్ షాపుల్లో 25% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఆరోగ్యకరమైన పానీయాన్ని అందించే నీరా కేఫ్‌ను మూలాన పడేశారని, కల్తీ పేరిట కల్లును నిర్వీర్యం చేస్తూ లిక్కర్ మాఫియాకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి మారకపోతే శ్రీలంక, నేపాల్ తరహాలో ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ముగ్గురు మంత్రులు భూ కబ్జాల్లో నిమగ్నమయ్యారని విమర్శిస్తూ.. గతంలో స్కూటర్లపై తిరిగిన ఆ ముగ్గురికి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కల్లు అమ్మకాలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తున్నదని, అక్రమ కేసులు, దాడులతో గీత కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ ధ్వజమెత్తారు. కమిటీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో గౌడ కులం అనాథగా మారిందని, అయినప్పటికీ గౌడ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మహేశ్ కుమార్‌గౌడ్ లాంటి వారు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు దుర్గయ్యగౌడ్, వీరస్వామి, ప్రభాకర్, శ్రీకాంత్, గడ్డమీది విజ య్ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.