మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 8: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్‌ను తాను 99 ఏండ్లపాటు లీజుకు తీసుకున్నానని మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన మాటలు అవాస్తమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆరోపణలను నిరూపిస్తే ‘నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అవాస్తవమైతే మీరు తప్పుకుంటారా?’ అని సవాల్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా నిరూపించండి.. ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తా.
రోగుల బంధువులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఎదుట షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ నిర్మాణం చేపట్టాం’ అని వివరించారు. పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయకుండా తప్పుడు ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జేఎన్టీ యూ క్యాంపస్ ఏర్పాటుకు జీవో జారీ చేసినా.. ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు.