హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వచ్చే పంటకాలానికైనా పాలమూరు – రంగారెడ్డి పథకం నుంచి సాగునీటిని అందించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పది నెలల తర్వాత ప్రాజెక్టును చూసేందుకు మం త్రులు బుధవారం వస్తున్నారని, వారి పర్యటనను బీఆర్ఎస్ స్వాగతిస్తున్నదని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని తెలిపారు. కేవలం కాలువ పని ఉన్నదని, దీనికి కూడా టెండర్లు గతంలోనే పిలిచామని వివరించారు.
మంగళవారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బొమ్మెర రామమూర్తితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వలసల పాలమూరును పచ్చబడేలా చేశారని, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత ఆయనదేనని స్పష్టంచేశారు. పాలమూరులో లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చారని గుర్తుచేశారు. తాము పిలిచిన టెండర్లను కొనసాగించి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని, ఈ వానకాలం పంటలకే నీళ్లు వచ్చేవని, కనీసం వచ్చే పంటలకైనా నీళ్లివ్వాలని సూచించారు.
గతంలో పాలమూరుకరువును చూపి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చేవారని, ఆ నిధులను ఇతర పనులకు ఖర్చు చేసేవారని శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో పాలమూరు జిల్లా రైస్ మిల్లుల్లోకి ధాన్యం ఫుళ్లుగా వచ్చిందని చెప్పారు.కాంగ్రెస్ మంత్రులు భేషజాలకు పోకుండా పాలమూరు పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు. తమ మీద కోపంతో పనులను ఆలస్యం చేయవద్దని, ఎప్పుడు ప్రాజెక్టు పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్నారు. వట్టెం పంపుహౌస్ మునక బాధ్యులపైనా చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రుల పర్యటన పాలమూరు రైతులకు భరోసా ఇచ్చేదిగా ఉండాలని, రాజకీయ విమర్శలకు తావివ్వకుండా రైతుల కోణంలో ఆలోచించాలని సూచించారు. చెక్ డ్యామ్‌లు, కాలువల పనులు పూర్తి చేయడంపై మంత్రులు దృష్టి పెట్టాలని, రిజర్వాయర్లు, లిఫ్ట్‌ల వారీగా సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న జూపల్లికి కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పురోగతి తెలుసునని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనానికి త్వరలోనే తమ పార్టీ బృందం తమిళనాడులో పర్యటిస్తుందని ఆయన తెలిపారు.