42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడెందుకు చట్టబద్ధత కల్పించడం లేదు?
– మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): జీవో ద్వారా కాకుండా, చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడా రు. ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడెందుకు చట్టబద్ధత కల్పించడం లేదని ప్రశ్నించారు. పైగా అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా, ఈ రిజర్వేషన్ల కోసం జీవో ఎందుకు తెచ్చారని, ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది? కదా అని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల కోసం కులగణన చేసిన కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అలాంటి రాజకీయానికే తెరలేపిందని, స్థానిక ఎన్నికల్లో జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు డ్రామాలాడుతున్నదని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత ఇదే కేసును కొట్టివేస్తే అభ్యర్థుల పరిస్థితి ఏమిటని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టులో బుధవారం జరిగిన వాదనల నేపథ్యంలో బీసీ మంత్రులు మాత్రమే కోర్టుకు వెళ్లారని, ఓసీ మంత్రులు ఎందుకు వెళ్లలేదని శ్రీనివాస్‌గౌడ్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లును ఆమోదింపజేస్తామంటేనే అసెంబ్లీలో ఆ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అన్న విషయాన్ని గుర్తుచేశారు. బీసీలు, ఓసీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నానికి కాంగ్రెస్ ఒడిగట్టిందని విమర్శించారు. తమ రాజకీయాల కోసం బీసీలను బలిపశువులను చేయొద్దని హితవు పలికారు. రిజర్వేషన్ల విషయంలో సర్కారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్యెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కా ర్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.