మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాజకీయ బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో మాత్రం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. అందులో భాగంగానే పథకం ప్రకారం కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అక్కడే గుమిగూడిన రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచమంతా అద్భుతమని పొగుడుతుంటే రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం వెనుక కుట్ర దాగి ఉన్నదని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కుమ్మక్కై తెలంగాణ నీళ్లను తరలించుకుపోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పెండింగ్ పెట్టి గోదావరి జలాలు తరలించుకు పోయేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు.