మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 14 : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలకు గురి చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నుంచి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను ఆయన సన్మానించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేక అధికార పార్టీ మద్యం, డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని ధ్వజమెత్తారు. గులాబీ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు అన్ని పార్టీల నాయకులు ఏకమయ్యారని విమర్శించారు. డబ్బుల సంచులు నియోజకవర్గాలకు తరలిపోతున్నా పోలీసు అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టింపులేదని వాపోయారు. ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ అభ్యర్థులు నిబద్ధతతో గెలిచారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు 5 శాతం సీట్లు కూడా లేవని గుర్తుచేశారు. కానీ బీఆర్ఎస్ 30 నుంచి 40 శాతం సీట్లు గెలుచుకున్నదని చెప్పారు.
50 ఓట్లలోపు 5 స్థానాలు కోల్పోయామని తెలిపారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సమస్యలు పరిష్కరించిన తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేయడంతోపాటు ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు.