హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యా విధానంపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ముసాయిదా-2025ను ఉపసంహరించుకునేంత వరకూ ప్రభుత్వం పోరాడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 5న బెంగళూరులో 6 రాష్ర్టాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో ఈ అంశంపై సంయుక్త తీర్మానం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు పంపినట్టు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే కేరళలో మరోసారి సమావేశం కానున్నట్టు చెప్పారు. వైస్ చాన్స్లర్ల నియామకాల్లో రాష్ర్టాల ప్రాతినిధ్యం లేకుండా అధికారాలను పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, అయినా కేంద్రం తమ అధికారాలను లాక్కోవాలని చూడడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి ఆక్షేపించారు.
హెచ్‌సీ రోబోటిక్స్ 500 కోట్ల పెట్టుబడి..
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించి యు వతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సెంటిలియాన్ నెట్వర్క్స్కు చెం దిన హెచ్‌సీ రోబోటిక్స్ ముందుకొచ్చినట్టు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి మంత్రి వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌రంజన్, సెంటిలియాన్ నెట్వర్క్స్ చైర్మన్ వెంకట్, డైరెక్టర్ రాధాకిశోర్, ఇండియా ఆపరేషన్స్ హెడ్ సుధాకర్ పాల్గొన్నారు.