భద్రాచలం, జూలై 25: భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామకోటి పుస్తకాలను సోమవారం నిమజ్జనం చేశారు. భక్తులు భద్రాద్రి రామయ్యకు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను ఏటా శ్రావణ మాసంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గోదావరిలో నిమజ్జనం చేస్తుంటారు. ఈ ఏడాది ముందుగానే గోదావరికి వరదలు రావడంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఆషాఢంలోనే నిమజ్జనం చేశారు. ఆషాఢ బహుళ ద్వాదశి రోజున రెండు లారీల్లో తెచ్చిన రామకోటి పుస్తకాలను నదిలో నిమజ్జనం చేశారు.
ముందుగా ఆలయం వద్ద రామకోటి పుస్తకాలకు విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యాహవాచన చేశారు. తీర్థ జలాలను శ్రీరామకోటి పుస్తకాలను ఉంచిన వాహనాలపై చల్లారు. అనంతరం ఆలయ ఈవో శివాజీ దంపతులు, అర్చకులు పుస్తకాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరామ రామేతి, రమే రామే శ్లోకాన్ని పఠించి పుస్తకాలను నిమజ్జనం చేశారు.