జీర్ణ ఆలయ పునరుద్ధరణ అనేది నూరు కొత్త ఆలయాల నిర్మాణంతో సమానమని, దీనివల్ల ప్రజలకు, దేశానికి క్షేమం కలుగుతుందని, వృద్ధి సాధ్యమవుతుందన్న వేదపండితుల మార్గనిర్దేశనం అనుసారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడప్ప కొండూరు గ్రామంలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, డి.ఆర్. అనిల్ కుమార్ దంపతులు తలపెట్టిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత నృసింహ స్వామి ఆలయం జీర్ణోద్ధరణ, శిలా మయ, లోహ మయ మూర్తుల, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కుంభాభిషేక కార్యక్రమాలు గత ఐదు రోజులుగా అంగరంగ వైభోగంగా, భక్త జన రంజకంగా, ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతూ మురిపిస్తున్నాయి.
ఐదో రోజు ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలలో సీఎం కేసీఆర్ సతీమణి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాతృమూర్తి కల్వకుంట్ల శోభ ఆలయాన్ని సందర్శించి, పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రతిష్ఠించనున్న మూర్తులకు జల, క్షీర, పుష్ప, ఫల, ధన, ధాన్య, శయ్యాధివాసాల క్రతువులు శాస్త్రోక్తంగా ఫలవంతంగా సాగాయి. గత ఐదు రోజులుగా నారసింహ హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈరోజు తలపెట్టిన నవనారసింహ పూజ భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ నిర్వహించబడింది. నరసింహ స్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహ స్వామి ఆధ్వర్యంలో రుత్వికుల శ్రేణి, పాంచరాత్ర ఆగమ శాస్త్ర అనుసారం నిర్వహిస్తున్న కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
గురు పరంపరకు నమస్కరిస్తూ ప్రాతః ఆరాధనతో మొదలైన కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రాణప్రతిష్ట చేయబడే మూల మంత్ర మూర్తి మంత్ర హవనము, తెలిసో తెలియకో జరిగే అపరాధాలు నుంచి ముక్తం కలిగించే పంచ సూక్త పరివార ప్రాయశ్చిత్తం హవనము, చతుఃస్థానార్చన, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. నవ నారసింహ పూజలో భాగంగా ఉగ్ర, కృధ్ధ, వీర, విలంబ, కోప, యోగ, అఘోర, సుదర్శన, శ్రీలక్ష్మి నరసింహ ఆరాధన చూడముచ్చటగా జరిగింది. నరసింహ కరావలంబం, నరసింహ స్తోత్రాలు అనంత భక్తిశ్రద్ధలతో పఠించారు.
ఆలయానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేసి పవిత్ర నరసింహమాలను అర్చకుల చేతుల మీదుగా ధరింప చేయడం ప్రజలను ఆకట్టుకున్నది. ప్రాణ ప్రతిష్ట చేయబడి కోరిన కోర్కెలను తీర్చే నరసింహ స్వామి ప్రతిష్టాపన వేడుకలు ఆహుతులను తరింపజేసాయి. ఈ కార్యక్రమాలలో యజమానులుగా కల్వకుంట్ల కవిత, డి ఆర్ అనిల్ కుమార్ దంపతులు కార్యనిర్వహణ చేయగా, రామ్ కిషన్ రావు, నవలత, డి ఆర్ అరుణ్ కుమార్, ననిత, కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఉత్సవాల చివరి రోజు కార్యక్రమాలు
గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రాతః ఆరాధనతో ప్రారంభమయ్యే కార్యక్రమాలలో మహా పూర్ణాహుతి నిర్వహించబడుతుంది. ఉదయం 7 గంటల 56 నిమిషాలకు హస్తా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున మహా కుంభ ప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం విగ్రహాల స్థాపన, శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం అనంతరం ఆరు రోజులుగా అశేష భక్త జన సందోహం మధ్య, శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో సాగిన ప్రతిష్టాపన క్రతువు ముగియనున్నది.
ఆలయ సందర్శనకు ప్రముఖులు తరలివచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు సతీమణి శ్రీమతి శోభమ్మ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ , కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేశ్ గుప్తా, స్థానిక ఆర్మూర్ శాసనసభ్యులు పిఏసి చైర్మన్ జీవన్ రెడ్డి, నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు కమలాకర్ రావు, పండిత పరిషత్ అబ్దుల్లా, కృపాల్ సింగ్‌తోపాటు అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారు.