యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26 : యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారు గోవర్ధనగిరిధారిగా అలంకృతుడై భక్తుల సేవలను అందుకున్నాడు. కుడి చేత పిల్లనగ్రోవి, ఎడమ చేతి చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన స్వామివారిని పట్టు పీతాంబరాలతో అలంకరించి ప్రధానాలయంలో అధిష్ఠించారు. ఉత్సవ మండపంలో చతుర్వేదాలు, మూలమంత్రాలు, మూర్తి మంత్రాలు, హోమాలు, నారసింహ మహామంత్రం, పంచసూక్తాలు, నిత్య లఘు పూర్ణాహుతి, నిత్య పూర్ణాహుతి, వేదాలు, పారాయణాలు, ఇతిహాసాలు గావించారు.
పంచసూక్తాలు, ఉపనిషత్తులు పఠిస్తూ రుత్వికులు, అర్చకులు ముందు నడుస్తుండగా.. భక్తుల గోవింద నామస్మరణ నడుమ తిరువీధిసేవ వైభవంగా సాగింది. సాయంత్రం స్వామివారిని సింహవాహన సేవలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. వైటీడీఏ ఆధ్వర్యంలో డాక్టర్ ఆనందశంకర్ జయంత ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన, మంగలభట్ బృందంతో కథక్ నృత్య ప్రదర్శన, మల్లాది బ్రదర్స్ ఆధ్వర్యంలో కర్ణాటక గాత్ర కచేరి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.