హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : శాసనమండలిలో బుధవారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం పొందింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. అలాగే జీఎస్టీ పన్ను సవరణ బిల్లులను కూడా ఆమోదించారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) యూపీఎస్సీ పనితీరుపై అధ్యయనం చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం నేతృత్వంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఐదుగురు సభ్యుల బృందం బుధవారం యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్ సహా కమిషన్ సభ్యులతో భేటీ అయ్యింది.
రిక్రూట్మెంట్లో అనుసరిస్తున్న పద్ధతులు, డిసిప్లినరీ కేసులు, ఆర్థిక స్వయంప్రతిపత్తి, ఐటీ వినియోగం, పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంపై చర్చించారు. పర్యటనలో టీజీపీఎస్సీ సభ్యులు అనితారాజేంద్ర, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, రామ్మోహన్రావు, పాల్వాయి రజినీకుమారి పాల్గొన్నారు.