హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో గురువారం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 28,29 తేదీల్లో శాసనసభ, శాసనమండలి సభ్యులకు స్పోర్ట్స్ మీట్- 2026 నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో 28వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని, సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు సభ్యులందరూ పాల్గొంటారని వెల్లడించారు. రవీంద్రభారతిలో సాంసృతిక కార్యక్రమాలను ఘనం గా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.