శనివారం 04 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:34

వైద్యవిద్యకు ప్రత్యేక ప్రాధాన్యం

వైద్యవిద్యకు ప్రత్యేక ప్రాధాన్యం

  • నల్లగొండ, సూర్యాపేట వైద్యకళాశాల్లో మౌలిక వసతులు
  • మంత్రులు ఈటల రాజేందర్‌,జగదీశ్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం వైద్యవిద్యకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నదని మంత్రులు ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ వైద్యకళాశాలల సంఖ్య పెంచడంతోపాటు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. సూర్యాపేట, నల్లగొండ వైద్య కళాశాలల్లో అదనపు వసతులు, నియామకాలు చేపట్టడంపై సోమవారం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. 

నల్లగొండ, సూర్యాపేట వైద్యకళాశాలలు  రెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో సిబ్బంది నియామకంపై చర్చించారు. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో మార్చురీలు ఆధునీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎండీ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo