BC Reservations | హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను పురమాయించారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతోనూ సీఎం చర్చించారు. హైకోర్టు తీర్పు ప్రతితోపాటు ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు అవసరమైన ఇతర పత్రాలను ఇప్పటికే అధికార వర్గాలు ఢిల్లీకి పంపాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున సోమవారం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డితోపాటు సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయనున్నాను.
అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయంపైనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును అనుసరించే తదుపరి కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం నాటి సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదనలు చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి రాకుండా అడ్డుకున్నదే ఈ కాంగ్రెస్ పార్టీ నేతలని, ఇప్పుడు ఓట్ల కోసం వీరు చేస్తున్న హడావుడిని తెలంగాణ ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్, ఇతర బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లను హైకోర్టులో సవాల్ చేసి స్టే పొందిన పిటిషనర్ బుట్టెంగారి మాధవరెడ్డి తదితరులు గత శుక్రవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ
స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) లేఖ రాసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని హైకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఎలా ముందుకెళ్లాలో చెప్పాలంటూ ఆ లేఖలో పేర్కొన్నది. ఎన్నికల ప్రక్రియ నిమిత్తం జారీచేసిన 9, 41, 42 జీవోల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో తెలిపింది. 50% రిజర్వేషన్లు మించకుండా మిగిలిన సీట్లను దామాషా పద్ధతిలో ఓపెన్ క్యాటగిరీ కింద పరిగణనలోకి తీసుకొని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇలా రిజర్వేషన్లు విభజించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో స్థానిక పోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎన్నికలపై ముందుకెళ్లాలా? సుప్రీం తీర్పు కోసం ఎదురుచూడాలా? లేదా హైకోర్టు స్టేను వెకేట్ చేసే దాకా ఆగాలా? అని నిర్ణయించే బంతి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోనే ఉన్నది.