హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : వాళ్లు సర్కారు బడుల్లో పనిచేశారు. స్కూళ్లను ఊడ్చి, కడిగి, శుభ్రం చేశారు. ఆఖరికి మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా మార్చారు. మొక్కలకు నీళ్లు పోసి, కంటికి రెప్పలా పెంచారు. అలా ఏకంగా 10 నెలల పాటు పనిచేశారు. అయినా ఆ స్పెషల్ వర్కర్లకు వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చాలా జిల్లాల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెట్టారు. పనిచేయించుకుని, వేతనాలు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో అరకొర నిధులనే విడుదల చేశారు.
సర్కారు బడుల్లో పారిశుద్ధ్య బాధ్యతలను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించింది. స్పెషల్ వర్కర్లను నియమించుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవోను జారీచేసింది. వారికి వేతనాలు చెల్లించేందుకు స్కూల్ ఫెసిలిటీ, మెయింటెనెన్స్ గ్రాంట్‌ను ఇస్తామని ప్రకటించింది. విద్యార్థుల సంఖ్య 1-30లోపు ఉంటే రూ.3 వేలు, 31-100లోపు ఉంటే రూ.6 వేలు, 101-250లోపు ఉంటే రూ.8 వేలు, 750 మంది విద్యార్థులు దాటితే రూ.20 వేలు ఇస్తామని స్పష్టం చేసింది. డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ (డీఎంఎఫ్టీ) నిధుల నుంచి స్పెషల్ వర్కర్స్కు వేతనాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో 2023 ఆగస్టు నుంచి అన్ని పాఠశాలల్లో స్పెషల్ వర్కర్లను నియమించుకున్నారు.
వారి వేతన నిధులను విడుదల చేసే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కానీ, ఈ నిధుల విడుదలలో కలెక్టర్లు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు. ములుగు జిల్లాలో ఒక నెల నిధులను మాత్రమే విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జనగామ, సూర్యాపేట, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 3 నెలలకు సంబంధించిన నిధులు మాత్రమే విడుదలయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 5 నెలలు, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో 6, జోగులాంబ గద్వాల జిల్లాలో 8, నాగర్‌కర్నూల్ జిల్లాలో 9 నెలల నిధులు మాత్రమే విడుదల చేశారు.