హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. దేశ ఆరోగ్య రంగంలో తెలంగాణను నంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన బీఆర్కే భవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ప్రతి పీహెచ్సీలో డాక్టర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోవాలని స్పష్టంచేశారు. మనం 99 శాతం బాగా పనిచేసినప్పటికీ, ఒక శాతం నిర్లక్ష్యంతో చెడ్డ పేరు వస్తుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
636 పీహెచ్‌సీలు, 232 యూపీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీంతో కలెక్టర్లకు నేరుగా పరిశీలించే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలు, టీ-డయాగ్నస్టిక్స్, ఆరోగ్యశ్రీ, 108, 102 (అమ్మ ఒడి) సేవలపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. కొత్త మెడికల్ కాలేజీలతో పాటు, దవాఖానల ఉన్నతీకరణ (అప్‌గ్రేడేషన్) పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ ఏడాది నూతనంగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన భూ కేటాయింపుల ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. వడగాడ్పుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.