హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్, రిజర్వ్ బ్యాంకు అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై గురువారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఏర్పాటైన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం(ఎస్ఎల్సీసీ) సీఎస్ అధ్యక్షతన జరిగింది. నాన్ బ్యాంకింగ్ ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక మోసాలు, రియల్ ఎస్టేట్, చిట్ఫండ్, డిపాజిట్ల సేకరణ తదితర అంశాల్లో ప్రజల నుంచి అందిన ఆర్థిక లావాదేవీల ఫిర్యాదులు, న్యాయస్థానాల్లో నమోదైన కేసుల గురించి సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… పోలీస్, రిజర్వ్ బ్యాంకు అధికారులు సమన్వయంతో సైబర్ నేరాలను నియంత్రించాలని చెప్పారు. లోన్ యాప్ల ద్వారా మోసపూరిత కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఆర్థిక పరమైన నేరాలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు. సైబర్ ఆధారిత నేరాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాటి నిరోధంపై ప్రజల్లో చైతన్యం తేవాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కే నిఖిల, ఆర్బీఐ జనరల్ మేనేజర్ రుచి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఐజీ రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రాష్ట్ర సీఐడీ విభాగం డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్, సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ సుమిత్ర తదితరలు పాల్గొన్నారు.