హైదరాబాద్: గంజాయిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మాదక ద్రవ్యాలపై ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో ప్రచారం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో 110 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడారు. గంజాయిని విశాఖ మన్యం నుంచి నాగ్‌పూర్ తరలిస్తున్నారని చెప్పారు. ప్రధాన నిందితులు లుంబరామ్ సోలంకి, కృష్ణారామ్ అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారయ్యారని చెప్పారు. విశాఖ వాసి పెద్దబాలన్న గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలిపారు. అరటిపండ్ల లోడు చాటున గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు.
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. నయా సవేరా ప్రోగ్రాం ద్వారా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అమృత ఫౌండేషన్, మరో లోకం అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. వారంలో ఒకరోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.