హైదరాబాద్, జనవరి 31 (నమస్తేతెలంగాణ): భారత రాజ్యాంగం 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఈనెల 7న శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో రాజ్యాంగంపై కూడా చర్చ జరపాలని కోరారు. శాసనసభా నాయకుడిగా సీఎం రేవంత్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. లేఖ ప్రతులను శాసనసభాపతి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి పంపినట్టు కూనంనేని వెల్లడించారు.
బీజేపీ పాలనలో దళిత సంక్షేమానికి నిధుల కోత ; సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు ఎం బాలనరసింహ
హైదరాబాద్, జనవరి 31 (నమస్తేతెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమానికి నిధుల కోత పెరిగిందని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం బాలనరసింహ అన్నారు. శుక్రవారం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలనరసింహ మాట్లాడుతూ.. దేశంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. కుల దురహంకార హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యేసురత్నం, అనిల్‌కుమార్, సహదేవ్, రాజ్‌కుమార్, కుమార్‌స్వామి, టీ రామకృష్ణ, కే వెంకటస్వామి, వై ఉషశ్రీ, బీ లక్ష్మీపతి, కే రాజరత్నం పాల్గొన్నారు.