హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే ముప్పు తెచ్చే పనులు చేస్తున్నది. కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ఉన్న మాదాపూర్ ఫ్లైఓవర్‌పై నీరు నిలిస్తే.. హైడ్రా చూపిన వింత పరిష్కారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. చిన్నవర్షానికే భారీ వరద చేరడంతో ఆ ఫ్లై ఓవర్ చెరువును తలపిస్తున్నది. వరద పోయే మార్గాలన్నీ మట్టితో కూరుకుపోగా, వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. ఫ్లెఓవర్లపై ఉండే డ్రెయిన్లలో శుద్ధి చేస్తే సరిపోయేదానికి.. ఏకంగా రిటైనింగ్ ఎర్త్ వాల్స్‌కు భారీ డ్రిల్స్ ఉపయోగించి రంధ్రాలు చేశారు. ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఫ్లైఓవర్ పటుత్వం కోసం వినియోగించే రబ్బర్ స్ట్రిప్‌లు తెగిపోయే ప్రమాదం ఉంటుందనీ, అదే గనుక జరిగితే ఏకంగా రిటైనింగ్ ఎర్త్ వాల్స్ కుప్పకూలిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఫ్లైఓవర్లను రోడ్లతో పోల్చితే చాలా టెక్నిక్‌గా నిర్మిస్తారు. ఏ మాత్రం అటు ఇటు అయినా వాటి ఉనికికే ప్రమాదం. కానీ డ్రెయిన్స్ ముందుగానే ఎందుకు క్లీన్ చేయలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో హైడ్రా ఫ్లైఓవర్లకు భారీగా రంధ్రాలు చేసింది. ఇలా వచ్చే నీరంతా కూడా ఉధృతితో రోడ్లపై పడుతుంది. అది కూడా వాహనాలకు ప్రమాదానికి గురయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది. డ్రెయిన్స్ క్లీన్ చేయాల్సిన అధికారులు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. మరి ఎండకాలం అంతా ఏం చేశారని, వర్షాలు పడుతుంటే.. ఫ్లైఓవర్లు మునిగిపోకుండా చూడాల్సిందిపోయి.. విచిత్రమైన చర్యలు తీసుకుంటూ వాటి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చడం దారుణమని అగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వరద నిర్వహణలో ముందస్తు చర్యలు చేపట్టాల్సిన హైడ్రా యంత్రాంగం ఆలస్యంగా మేల్కొన్నది. 2 నెలల కోసం 33 డీవాటరింగ్ పంపులు సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచింది. 25 హెచ్‌పీ, 12 హెచ్‌పీ డీవాటరింగ్ పంపులు సమకూర్చుకోనున్నట్టు పేర్కొంది. టెండర్ల దాఖలుకు ఈ నెల 13ను చివరితేదీగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సామగ్రి అందుబాటులోకి రావడానికి మరో నెలరోజులు పట్టే అవకాశమున్నందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పంపులతో ఈ సీజన్లో ఉపయోగం ఉంటుందా అని హైడ్రా అధికారుల నుంచే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వర్షాలను, వరదలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని హైడ్రా చేతిలో నగరాన్ని పెట్టడం వల్లే ఈ సమస్య వచ్చిందని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులే చెప్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నగరంలో ఏటా వరదలపై ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నుంచి స్పందన కనిపించేది. కానీ ఈసారి హైడ్రా వచ్చిందంటూ జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగాలు పెద్దగా స్పందించడంలేదు.
‘హైడ్రా వచ్చింది. వరద ముప్పు తీర్చడానికి హైడ్రా వచ్చింది. వర్షం ఎక్కడ పడుతుందో ఒకరోజు ముందే తెలుసుకుని అక్కడికి వెళ్లి రోడ్లపై నీళ్లు నిలవకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటుంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రణాళికలు చేస్తుంది. నగరంలో వరద ముప్పు తప్పిస్తుంది’
– హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో హైడ్రాను ఆకాశానికెత్తిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ నగరం మునిగిపోతుంటే.. మేయర్ గద్వాల విజయలక్ష్మి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వరద నీటి నిర్వహణపై వేసవిలో సమీక్షలు నిర్వహించడం మరిచి.. ఇప్పుడు ఇంట్లో కూర్చుని టెలికాన్ఫరెన్స్ వీడియో విడుదలతో ఫలితమేంటని నిలదీస్తున్నారు. ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేసి, బ్యూటీ పార్లర్ ఓపెనింగ్‌కు వెళ్లడం విడ్డూరమని మండిపడుతున్నారు.
జూన్ రెండవవారంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తమదే బాధ్యత అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. తమ దగ్గరున్న 51 డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి వరద ముప్పు లేకుండా చేస్తామని ప్రకటించారు. వర్షాకాలంలో వరద లేకుండా చేస్తామంటూ చెప్పిన హైడ్రా రంగనాథ్.. నగరాన్ని నీటముంచారంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇండ్లను కూల్చడంపై ఉన్న శ్రద్ధ.. తమ పరిధిలోని బాధ్యత అయిన వరద నీటి నిర్వహణపై పెట్టలేదని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ బుల్డోజర్లను రంగంలోకి దింపడంపై ఉన్న ఆసక్తి.. డ్రెయిన్స్ క్లీనింగ్‌పై, పంపులు సమకూర్చుకోవడంపై పెట్టలేదని నిప్పులు చెరుగుతున్నారు.