హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): టెండర్ నిబంధనల్లో సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారు? టెండర్లపై వివాదాలెందుకు ముసురుతున్నాయి? అని సింగరేణి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు ప్రశ్నించినట్టు తెలిసింది. ‘టెండర్ల స్కామ్ జరిగినట్టు ఆరోపణలొస్తున్నాయి.. పత్రికల్లో వార్తలొస్తున్నాయి. అసలేం ఏం జరుగుతున్నది?’ అని నిలదీసినట్టు సమాచారం. సింగరేణిలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం అత్యవసరంగా సింగరేణి బోర్డు మీటింగ్ నిర్వహించారు.
ఆన్లైన్ ద్వారా కొందరు, ఆఫ్‌లైన్ ద్వారా కొందరు ఈ సమావేశానికి హాజరయ్యారు. మీటింగ్ హాట్‌హాట్‌గా జరిగినట్టు తెలిసింది. నైని కోల్‌బ్లాక్ టెండర్లు, సైట్ విజిట్ సర్టిఫికెట్, టెండర్ల రద్దు అంశాలపై కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు పలు ప్రశ్నలు సంధించినట్టు సింగరేణి వర్గాలు తెలిపాయి. అయితే అధికారులు చెప్పిన సమాధానాల పట్ల సభ్యులు సంతృప్తి వ్యక్తంచేయలేదని పేర్కొన్నాయి. ముఖ్యంగా వారు సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై ఆరాతీసినట్టు సమాచారం.
‘అండర్‌టేకింగ్ లేదంటే సెల్ఫ్‌డిక్లరేషన్ తీసుకుంటే సరిపోయేది. పైగా సైట్ విజిట్ సర్టిఫికెట్లు అందరికీ ఎందుకివ్వలేదు?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. భవిష్యత్తులో జరిగే టెండర్లు, ఇతర ప్రక్రియలపై తాము దృష్టిపెడతామని, అవసరమైతే ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పినట్టు సమాచారం. బోర్డు సమావేశంలో లేవనెత్తిన అంశాలపై సింగరేణి అధికారులు సమాధానాలివ్వలేకపోయారని తెలిసింది. మొత్తంగా సమావేశం అరగంటలోనే ముగిసినట్టు సింగరేణి వర్గాలు పేర్కొన్నాయి.
సింగరేణి సంస్థకు సర్కార్ భారీగా బకాయిలుండటంపైనా బోర్డు డైరెక్టర్లు ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి రూ.47 వేల కోట్లు రావాల్సి ఉన్నా.. ఎందుకు రాబట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. సంస్థ సుస్థిరత సాధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. బొగ్గు నాణ్యత దెబ్బతింటున్నదని, నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సీఎస్సార్ నిధులు, డీఎంఎఫ్టీ నిధుల వాడకం, సింగరేణి భూముల ఆక్రమణలపైనా ప్రశ్నలు సంధించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.