హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక బస్సుల పేరుతో టీజీఎస్ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నది. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మాములు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రూ.290 చార్జీ ఉండగా, దసరా సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా రూ.70లను ఆర్టీసీ వసూలు చేసింది. ప్రస్తుతం మరో రూ.40 పెంచి రూ.110లు అదనంగా వసూలు చేస్తున్నది. ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ.400 వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు టికెట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులను సంప్రదించగా ..దసరా ముగిసిన 48 గంటల్లోనే స్పె షల్ బస్సులను రద్దు చేశామని చెప్పా రు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.