హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అవమానిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం మహేశ్వరంలో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మరాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా? అని ప్రశ్నించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటని మండిపడ్డారు. ప్రొటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.