హైదరాబాద్: బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన (Defection MLAs) 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద జరుగుతున్న విచారణకు తన అడ్వకేట్లతో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హాజరయ్యారు. మరికాసేపట్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తమ న్యాయవాదులతో కలిసి ప్రత్యక్ష విచారణకు హాజరుకానున్నారు. వీరి మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ సైతం ట్రిబ్యునల్ ముందు హాజరు కానున్నారు.
శాసనసభ భవనాల ప్రాంగణంలో ప్రత్యక్ష విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. అక్టోబర్ 6వరకు అమలులో ఉంటాయన్నారు. ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే పిటిషనర్లు, ప్రతివాదులు, వారికి సంబంధించిన న్యాయవాదులు కోర్టుహాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకురావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విచారణ కార్యకలాపాలను రికార్డ్ చేసినా, ఫొటోలు తీసినా ఫోన్లను జప్తుచేస్తామన్నారు.