నిజామాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి దారి చూపిన మహానేత సీఎం కేసీఆర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని 10వ వార్డులో సంత్‌శ్రీ రాంరావు మహారాజ్ విగ్రహాన్ని స్పీకర్ పోచారం ఆవిష్కరించారు. అనంతరం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రాంరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని 1,833 మంది బంజారాలకు 3,390 ఎకరాలకు సంబంధించిన పోడు భూములకు పట్టాలు అందుతాయని తెలిపారు. వీరికి రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందని చెప్పారు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలితే భవిష్యత్తులో వారికి కూడా న్యాయం జరుగుతుందన్నారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో నిర్మిస్తున్న సిద్దాపూర్, జకోరా – చందూర్ ఎత్తిపోతలతో అత్యధికంగా లబ్ధిపొందేది బంజారాలేనని స్పీకర్ పోచారం స్పష్టం చేశారు. నస్రుల్లాబాద్‌లో ఎస్టీ బాలుర కోసం ఇప్పటికే గురుకుల పాఠశాల ఉండగా, కొత్తగా గిరిజన బాలికల కోసం మరో గురుకులం మంజూరైందని వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గంలో 80 తండాలు ఉంటే ప్రతి తండాలో జగదాంబ మాతా, సేవాలాల్ మహారాజ్ మందిరాలున్నాయని తెలిపారు. బాన్సువాడకు 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైతే అందులో 2,500 ఇండ్లు కేటాయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో పౌరాదేవి పీఠాధిపతి బాబుసింగ్ మహారాజ్, బంజారా సేవాసమితి జిల్లా అధ్యక్షుడు బాద్యానాయక్, బంజారా నాయకులు మోహన్ నాయక్, సంగ్రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.