నస్రుల్లాబాద్, మే 1: ‘అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే.. ఇంట్లో దర్జాగా కూర్చుంటే ఎట్లా? పని చేయడం చేతకాకపోతే రాజీనామా చేయండి’ అంటూ వ్యవసాయశాఖ అధికారులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్‌లో గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం పంచాతీయలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వ్యవసాయాధికారులపై ఫిర్యాదు చేశారు.
ఏఈవో భానుప్రశాంత్రెడ్డి తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, విధులకు కూడా సక్రమంగా రావడం లేదని పోచారం దృష్టికి తెచ్చారు. ఓ రైతు 8 నెలల క్రితం మరణించినా రైతుబీమా ఆన్లైన్ చేయకపోవడంతో ఏవో నరేంద్ర, ఏఈవో భానుప్రశాంత్రెడ్డిపై స్పీకర్ మండిపడ్డారు. నస్రుల్లాబాద్ తహసీల్దార్ బావయ్య అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి రైస్‌మిల్లర్లతో మాట్లాడి ధాన్యం తరలించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సభాపతి ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హుటాహుటిన గ్రామానికి చేరుకొని, గ్రామంలోని ధాన్యం కుప్పలను పరిశీలించారు.