నిజామాబాద్ : పాఠశాల విద్యే విద్యార్థికి పునాదిలాంటిదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నస్రుల్లాబాద్ మండలం నెమిలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) రూ.61 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు విద్యనే మార్గమన్నారు.
విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందాలని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పోటీతత్వం పెరిగిందన్నారు. సర్కారు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. నియోజకవర్గంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తూ భారీగా నిధులు కేటాయించి అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గం పరిధిలోని పాఠశాలల్లో రూ.22కోట్లతో 220 అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులను మంజూరు చేశానన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని జూనియర్ కాలేజీల్లో అవసరమైన భవనాలు ఇతర వసతుల నిర్మాణానికి అవసరమైనన్ని నిధులను మంజూరు చేయించామన్నారు.
బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయించామన్నారు. రూ.40 కోట్లతో భవనాలు, ఇతర సౌకర్యాలు నిర్మిస్తున్నామని, పాఠశాలల్లో వసతుల మెరుగునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,300కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. నెమిలి జడ్పీహెచ్ఎస్కు అదనంగా మరో నాలుగు తరగతి గదులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పూర్వ, ప్రస్తుత విద్యార్థులకు అభినందనలు తెలిపారు.