నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 7: దొంగతనం చేసిన దొంగే.. దొంగదొంగ అన్నట్టుగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరు ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ తీరు దుర్మార్గంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. రేయింబవళ్లు కష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాటుపడుతుంటే ఇంత దుర్మార్గంగా, కుట్రపూరితంగా పేపర్లను లీకేజీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రూర్ మండలం రాయకూర్లోని మామిడి తోటలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ మాట్లాడారు. ప్రజలకు మేలు చేసి రాజకీయం చేయాలి కానీ, ఇలా దుర్మార్గపు రాజకీయం చేస్తే ప్రజలు బొంద పెడతారని బీజేపీ నేతలను హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి పిల్లల జీవితాలతో చెలగాటం ఆడతావా? అంటూ బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల్లో లీకేజీలు ఏంటి? ఇటీవ పబ్లిక్ కమిషన్‌లో నాటకం చేశారని ఆరోపించారు. అంత చేసిన దొంగలు వీళ్లేనని, వీరిని ప్రజలే శిక్షిస్తారని తెలిపారు.
Pocharam1
విద్యార్థుల, జీవితాలతో బీజేపీ చెలగాటం
విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజే పీ నాయకులు చెలగాటమాడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పా లన చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారని తెలిపారు.
ఇది చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్లను లీక్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్ర లపై ఆమె మండిపడ్డారు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కుట్రలను బయటపెట్టి అందుకు కారకులైన నిందితులను జైల్లో పెట్టడంతో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 59వ డివిజన్ల కార్యకర్తల సమ్మేళనంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్లో నిర్వహించిన సమ్మేళనంలో విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమా ర్, నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం కన్నెకల్‌లో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, తుంగుతుర్తి నియోజకవర్గం నూతనకల్‌లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, భువనగిరి మండలం హన్మాపురం, బీబీనగర్‌లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.