కామారెడ్డి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఖండిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే దేశం మనదని నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఆ పదవికి కళంకం తెచ్చినట్లని పేర్కొన్నారు. కామారెడ్డిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లికి పుట్టిన వాడు ఎవడు అలాంటి అసభ్య పదజాలం వాడరని తీవ్రంగా ఖండించారు.ఇలాంటి భాష మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
బీఆర్ఎస్(BRS) సైన్యం బయటకు వస్తే ఒక్క కార్నర్ మీటింగ్ జరపరని అన్నారు. మైకులు పట్టుకోగానే బూతులు, వ్యక్తిగత విమర్శలు పరిపాటిగా మారాయని ఆరోపించారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎంతో హుందాగా ఉండాలి. అంతేకానీ బజారు రౌడీ లాగ మాట్లాడకూడదని బండి సంజయ్(Bandi Sanjay) కు హితవు పలికారు. అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో నలుగురు ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని తెలంగాణలో మాత్రం రైతులను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వాన్ని ఆహ్వానిస్తుండగా బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.
తొమ్మిది ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతులకు, పేదలకు మంచి చేసిన ఒక్క పని చెప్పండని,బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా తాము వంద చెబుతామని వెల్లడించారు. ‘ జీఎస్టీ(GST) పెంచారు, డిమానిటైజేషన్ చేశారు. ఉచిత కరంటు వద్దంటారు. సబ్సిడీలు వద్దంటారు. ఎవరైనా మాట్లాడితే ఈడీ లు, బోడీ ’ లని ఎద్దేవా చేశారు.
ఈడీ విచారణ జరిగితే ముందుగా అధానిపై జరగాలని అన్నారు.140 కోట్ల మంది ప్రజలపై లేని ప్రేమ ఒక్క ఆదాని పై ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వ్యవస్థలో లోపాలుంటే సూచనలతో కూడిన విమర్శలు ఉండాలి. అంతేకానీ వ్యక్తిగత దూషణలు ఎప్పుడూ చేయరాద’ ని సూచించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ , రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీ బుద్దిన్, కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.