బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే ప్రక్రియ మొదలైంది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చలనం వచ్చింది. ఫిరాయింపుదారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులను జారీచేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో ఐదుగురు ఎమ్మెల్యేలకు తాఖీదులు పంపినట్టు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఉన్నట్టు తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): పార్టీ ఎందుకు మారారో 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలను నోటీసుల్లో స్పీకర్ ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగతా ఐదుగురికి కూడా నోటీసులు సిద్ధం అవుతున్నాయని తెలిసింది. సుప్రీంకోర్టు గడువు విధించడం, స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో వేటు తప్పదేమో అని ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అధికారం కోసం వస్తే పదవికే ఎసరొచ్చిందని తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు.. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. రాజకీయంగా సమీకరణాలు మారిపోతున్నాయి.ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలె యాద య్య, ప్రకాశ్‌గౌడ్ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరగా, దానిని అప్పట్లో పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయా పిటిషన్లను విచారించిన సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం జూలై 31న తుది తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు ధర్మాసనం ఆదేశాలను జారీచేసింది. విచారణకు ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ఆటంకాలు కలిగించరాదని, సాకులు చెప్పి విచారణను వాయిదా వేస్తే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులపై తెలంగాణ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో ఈ నెల మొదటివారంలో స్పీకర్ కార్యాలయం చర్చించి, న్యాయసలహా తీసున్నట్టు తెలిసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించడం అనివార్యమని వారు సూచించారని చర్చ జరుగుతున్నది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తాజాగా అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో తొలి విడతగా ఐదుగురికి రెండురోజుల క్రితమే నోటీసులను పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సంజాయిషీ తెలుపండి’ అని ఆ నోటీసుల్లో కోరినట్టు తెలిసింది. స్పీకర్ కార్యాలయం రెండో విడుతగా మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వీటిని మరో వారంరోజుల్లో అందజేయాలా? లేదా మొదటి ఐదుగురు ఎమ్మెల్యేల వివరణ పత్రాలు అందిన తర్వాత పంపాలా? అనే చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుందని, వచ్చే వారమే నోటీసులు ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆ 10 మంది ఎమ్మెల్యేల నుంచి లిఖితపూర్వక సంజాయిషీ తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేను స్పీకర్ వ్యక్తిగతంగా విచారిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా పరిణామాలతో రాష్ట్రంలో భారీగా ఉప ఎన్నికలు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూలై 31వ తేదీ నుంచి సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల వంటివి వెంటవెంటనే జరుగుతుండటంతో ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అసలు ఉప ఎన్నికలే రావని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మొన్నటిదాకా ‘మా పదవులు భద్రం’ అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ సుప్రీం తీర్పుతో ఆందోళన మొదలైంది. ఇప్పుడు స్పీకర్ నోటీసులను జారీ చేయడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల వాతావరణం మొదలైందని చెప్తున్నారు. ఉదాహరణకు గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్లకు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్‌కే చెందిన సరిత వర్గీయుల్లో ఆనందం నెలకొన్నదని చెప్తున్నారు. దీనిని అనుకూలంగా మార్చుకునేందుకు ఆమె ప్రయత్నాలను ము మ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. సరితకు ఎంపీ మల్లు రవి, అలంపూర్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే మద్దతుగా నిలుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటే కాంగ్రెస్ నుంచి తమకే టికెట్ ఇవ్వాలని సరిత మద్దతుదారులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
నిన్న మొన్నటిదాకా గంభీర ప్రకటనలు చేసిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలే తెలిపాయి. కాంగ్రెస్‌లో చేరి అధికారం అనుభవిద్దామని పార్టీమారితే అసలుకే మోసం వచ్చిందని వారు తమ తమ సన్నిహితులతో వాపోతున్నట్టు సమాచారం. పార్టీ మారినప్పటి నుంచీ అటు నియోజకవర్గ ప్రజల నుంచి, ఇటు కాంగ్రెస్ నేతల నుంచి అవమానాలను ఎదుర్కొంటున్నామని, మరోవైపు న్యాయ పోరాటాలు, నోటీసులతో రోజూ టెన్షన్ పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ వర్గాలు వేరు కుంపట్లు నడుస్తున్నాయి. వలస నేతలను పాత నేతలు, కార్యకర్తలు దగ్గరికి రానీయకపోవడంతో ప్రతిచోట కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. మొదటి నుంచీ పాలనా వైఫల్యాలు వెంటాడుతుండగా, తాజాగా పల్లెల్లో యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతుండటంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఇలా ఇంటాబయటా ఇబ్బందులతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీవ్ర ఉక్కపోతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ నోటీసులతో వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని అనుచరులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ పదవి పోతే నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి మళ్లీ గెలవడం మాట దేవుడెరుగు, కనీసం డిపాజిట్లు కూడా రావడం కష్టమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మూడునెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత గత 23 రోజులుగా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ‘ఏం చేద్దాం’ అన్నదానిపై ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు కాంగ్రెస్ ముఖ్యులు అనేక సమాలోచనలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యాలయం, స్పీకర్ కార్యాలయం అందుబాటులో ఉన్న సాంకేతిక, న్యాయ అంశాలను పరిశీలించారని సమాచారం. ఒకదశలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో లైవ్ టెలికాస్ట్, అసెంబ్లీ సమావేశాల అనంతరం వెలువడిన మినిట్స్ (సభలో పార్టీల వారీగా సభ్యుల వివరాలు వంటి అంశాలు) వాటిని (అంటే బీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, బీజేపీ, ఎంఐఎం పార్టీల సంఖ్యాబలాల్లో పార్టీ మారినట్టు చూపకుండా ఉన్న అంశాలను) పరిశీలించారని తెలిసింది. అయినా సరే ‘పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడం మినహా మరో మార్గం లేదు’ అని న్యాయకోవిధులు తేల్చి చెప్పడంతో స్పీకర్ కార్యాలయం నోటీసులను జారీ చేసిందని చెప్తున్నారు.
నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక్కో రకంగా స్పందించారు. స్పీకర్ కార్యాలయం నుంచి తనకు నోటీసులు అందినట్టు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. వాటిపై న్యాయనిపుణులతో చర్చించి, స్పీకర్‌కు వివరణ ఇస్తానని తెలిపారు. తాను పార్టీ మారలేదని, సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నానని మళ్లీ పాతపాటే పాడారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని చెప్పారు. మిగతా నలుగురు ఎమ్మెల్యేలు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. నోటీసులు అందాయని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్ సంబంధీకులు ధ్రువీకరించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తమకు అసలు నోటీసులే అందలేదని చేవెళ్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్ బదులిచ్చారు. తనకు నోటీసులు వచ్చాయని, అయితే జ్వరం వల్ల తాను వాటిని చూడలేదని, నోటీసులోని అంశాలను బట్టి సమాధానం ఇస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ పేర్కొన్నారు.