Space Technology | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్లో తొలిసారి స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఇస్రో, సైన్స్ అండ్ టెక్నాలజీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం అర్థించాలని జేఎన్టీయూ భావిస్తున్నది. యూనివర్సిటీ ఆవరణలోనే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్లానెటోరియాన్ని కూడా నిర్మించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ విభాగం కోసం మొత్తంగా రూ.60 కోట్ల వరకు అవసరమవుతాయని భావిస్తున్న వర్సిటీ అధికారులు రూ. 50 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిసింది. మిగతా రూ.10 కోట్లను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) నుంచి పొందే ప్రయత్నం చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుంచి మానవ వనరులతోపాటు సాంకేతికతకు సంబంధించి సాయం పొందేందుకు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు.
జేఎన్టీయూ హైదరాబాద్లో స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి వస్తే ఇంజినీరింగ్ విద్యార్థులకు అది వరంగా మారుతుంది. ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలలో ఉద్యోగాలు పొంది తమ కలను నెరవేర్చుకునేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విభాగం ఏర్పాటుపై త్వరలోనే మరింత స్పష్టత వస్తుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ తెలిపారు.