వికారాబాద్ : లగచర్ల ఘటనలో( Lagacharla incident) 52 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఏస్పీ నారాయణరెడ్డి(SP Narayana Reddy) తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులపై దాడి చేసిన వారిలో సురేష్ కీలకంగా వ్యవహరిం చారన్నారు. రాజకీయ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని, విచారణలో అన్ని తెలుస్తాయన్నారు. కాగా, తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో లగుచర్ల రైతులు తిరగబడ్డారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదని ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోళ్లను దొరికినట్టు తరిమికొట్టారు.
కడా స్పెషల్ ఆఫీసర్, పరిగి డీఎస్పీని చుట్టుముట్టి మరీ చితకబాదారు. దీంతో అర్ధరాత్రి నుంచే పోలీసు బలగాలు భారీ ఎత్తున లగచర్లను చుట్టుముట్టాయి. కరెంటు తీసేసి ప్రతి ఇంటిని జల్లడపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను అడ్డుకున్నారు.ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటూ చేస్తూ ఎవరిని అనుతించడం లేదు.
ఇంటర్నెట్ సేవలను (Internet services)నిలిపివేశారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో అర్ధరాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలు పని చేయడం లేదు. నియోజకవర్గంలోని గిరిజన తండాలు పోలీసుల చక్రబంధంలో విలవిల్లాడుతున్నాయి. మీడియాపై కూడా అంక్షలు విధించారు. అసలు కొడంగల్‌లో ఏం జరుగుతుందోనని లంబాడి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫార్మా క్లస్టర్లు వ్యతిరేకిస్తే ఇంత దారుణమా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.