ఆదిలాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సోయాబిన్‌ను క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5,328తో సేకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా పంటలో చెత్త, వ్యర్థాలు లేకుండా రైతులు సోయా పంటను విక్రయించడానికి వాహనాల్లో మార్కెట్ యార్డులకు తీసుకొస్తున్నారు. పంట కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా షెడ్యూల్ ప్రకటించి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నా.. మార్కెట్ యార్డుల్లో రైతులు పంటను అమ్మడానికి తిప్పలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్ చేసి రైతులు ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ పద్ధతిలో పంటను సేకరిస్తున్నారు. పంట విక్రయంలో భాగంగా బార్కోడ్ జారీ చేస్తారు. ఇందుకోసం వేలిముద్ర వేయాలి. పంటను కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ అధికారులు సంచులు ఇస్తుండగా అప్పుడు ఒకసారి, పంట విక్రయించిన వివరాలు నమోదు చేసేటప్పుడు మరోసారి రైతులు వేలి ముద్రలు వేయాలి.
కొందరు రైతుల వేలిముద్రలు పడకపోవడంతో వారు సోయా పంటను అమ్ముకునే అవకాశం లేకుండా పోతున్నది. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేస్తుండగా.. ఓటీపీ పద్ధతి అమలు చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో కొనుగోళ్లు జరుగుతుండటంతో వేలిముద్ర పడకపోతే తాము ఏమీ చేయలేమని అధికారులు అంటున్నారు. పంటలో వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక రైతులు ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలుకు రూ.4,500లకు విక్రయించి నష్టపోతున్నారు.