న్యూఢిల్లీ, జనవరి 17: వాతావరణ మార్పుల కారణంగా గడిచిన పదేండ్లలో (2012-2022 వరకు) దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల వర్షపాతం పది శాతం వరకు పెరిగింది. దేశంలోని 55 శాతం తహశీల్, ఉప జిల్లాల్లో పది శాతం పెరుగుదల నమోదయినట్టు ది కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 4,500పైగా తహశీల్స్లో 40 ఏండ్ల వర్షపాతం డాటాను ఈ సంస్థ విశ్లేషించింది. గత దశాబ్దంలో 11 శాతం ఉప జిల్లాల్లో నైరుతి రుతుపవనాల వర్షపాతం తగ్గినట్టు గుర్తించింది. భారత ప్రభుత్వం 2024 బడ్జెట్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అస్థిర వర్షపాతాల నమూనాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రణాళికలు రూపొందించేందుకు తమ అధ్యయనం ఉపయోగపడుతుందని సీఈఈడబ్ల్యూ సీనియర్ ప్రోగ్రాం అధిపతి విశ్వాస్ చితాలే తెలిపారు.