Traffic Alert: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) మరికొన్ని గంటల్లో హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. శనివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో చారిటీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్‌లో రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions), దారి మళ్లింపులు అమలులో ఉంటాయని తెలిపారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
‘జీవోఏటీ’ టూర్లో భాగంగా శనివారం తొలుత కోల్‌కతాకు చేరుకోనున్న మెస్సీ.. సాయంత్రం 4గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగనున్నాడు. అక్కడి నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొంటాడు. ఫొటో దిగేందుకు రికార్డు స్థాయిలో రూ.10 లక్షలు చెల్లించిన 60 మంది మెస్సీతో ఫోజులివ్వనున్నారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఫుట్‌బాల్ క్లినిక్‌లో యువ ప్లేయర్ల అభివృద్ధి కోసం వినియోగిస్తామని ‘గోట్ హైదరాబాద్’ సమన్వయకర్త పార్వతిరెడ్డి పేర్కొన్నారు.
ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ మైదానంలో లియోనల్ మెస్సీ అభిమానులను అలరించనున్నాడు. 15 నుంచి 20 నిమిషాల పాటు జరిగే ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ పోరులో అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్, సింగరేణి ఆర్ఆర్9 జట్లు పోటీపడనున్నాయి. మ్యాచ్‌కు ముందు మెస్సీ.తన డ్రిబ్లింగ్ స్కిల్స్‌తో ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపనున్నాడు. పెనాల్టీ షూటౌట్ తర్వాత విజేతను నిర్ణయించనున్నారు. ఒక్కో టీమ్‌కు మూడుసార్లు అవకాశమివ్వనున్నారు. మెస్సీ తనదైన శైలిలో సాకర్ నైపుణ్యం ద్వారా స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులను ఆకట్టుకోనున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత 20 మంది చిన్నారులకు 25 నుంచి 30 నిమిషాల పాటు మెస్సీ, రోడ్రిగో, లూయిస్ సురెజ్ మెళకువలు నేర్పించనున్నారు. మరోవైపు ఉప్పల్‌లో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మెస్సీ మ్యాచ్ కోసం ఇప్పటికే 27,000టికెట్లు అమ్ముడుపోయాయని, శనివారం సాయంత్రానికి స్టేడియం పూర్తి సామర్థ్యం 39,000 చేరుకునే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు.
చాలా ఏండ్ల తర్వాత భారత్‌కు రాబోతున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి కనివినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా జడ్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియా భేటీలో పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి మళ్లీ తిరిగి వేళ్లే వరకు మెస్సీ కోసం గ్రీన్‌చానల్ ఏర్పాటు చేస్తున్నారు. మెస్సీ ప్రయాణించే దారిపొడవున పోలీసులను మోహరించనున్నారు. దీనికి తోడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపు మూడు వేల మంది పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. టికెట్లు, పాస్‌లు ఉన్నవాళ్లే స్టేడియానికి రావాలని అభిమానులకు సీపీ సూచించారు. మెస్సీ రాకను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని టికెట్లు లేకుండా ఎవరూ స్టేడియానికి వచ్చే ప్రయత్నం చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్ మొదలు కావడానికి మూడు గంటల ముందే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు.