Demon Pavan | ఊహించని మలుపులు, బంధాలు, అనుబంధాలతో ఎమోషనల్ రోలర్ కోస్టర్లా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో షో ముగియనున్న నేపథ్యంలో, కంటెస్టెంట్లను తమ కుటుంబ సభ్యుల్లా భావించిన ప్రేక్షకులు వారిని మిస్ అవ్వబోతున్నారు. ఈ క్రమంలో టైటిల్ రేస్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి టైటిల్ విన్నింగ్ పోరు పవన్ కళ్యాణ్ మరియు తనూజ మధ్యే జరుగుతోందని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే టాప్ 5లో ఎవరు ఉంటారు అన్నదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో టాప్ 5లో కచ్చితంగా ఉండేందుకు అర్హత ఉన్న కంటెస్టెంట్లలో డిమోన్ పవన్ ఒకడిగా గుర్తింపు పొందాడు.
‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన డిమోన్ పవన్, తన అద్భుతమైన ఆటతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. రీతూ చౌదరితో లవ్ ట్రాక్ కారణంగా కొంతకాలం అతని గ్రాఫ్ పడిపోయినప్పటికీ, ఫిజికల్ టాస్కుల్లో ప్రతి సారి తన సత్తా చాటుతూ “నాతో పోటీ ఎవ్వరూ పడలేరు” అనే స్థాయిలో నిలబడ్డాడు. రీతూ చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత డిమోన్ పవన్‌లో కొత్త ఫన్ యాంగిల్ బయటకు వచ్చింది. రోజురోజుకు అతని ఎంటర్టైన్మెంట్ లెవల్ పెరుగుతూ వస్తోంది. మొదటి రోజు నుంచే ఈ యాంగిల్ చూపించి ఉంటే, నేడు అతను కూడా నేరుగా టైటిల్ రేస్‌లో ఉండేవాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో డిమోన్ పవన్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదన్న స్థాయికి అతని ఆట చేరింది. సాధారణంగా ఇమ్మాన్యుయేల్ అందించే వినోదాన్ని ఈసారి డిమోన్ పవన్ భర్తీ చేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది.
అయితే ఇంత పాజిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ డిమోన్ పవన్‌కు ఈ వారం అన్యాయం జరగబోతుందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. విశ్లేషకుల సమాచారం ప్రకారం ప్రస్తుతం డిమోన్ పవన్ డేంజర్ జోన్లో కొనసాగుతున్నాడట. అందరూ అతనికి భారీ ఓటింగ్ పడుతుందని భావిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఆ స్థాయిలో ఓట్లు పడటం లేదని చెబుతున్నారు. అతనికంటే భరణి, సంజన ఓటింగ్‌లో ముందంజలో ఉన్నట్టు సమాచారం. సరైన పీఆర్ టీం లేకపోవడం వల్లే డిమోన్ పవన్‌కు ఆశించిన స్థాయిలో ఓట్లు రావడం లేదన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే, సుమన్ శెట్టితో పాటు డిమోన్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరి దశలో ఈ అనూహ్య మలుపులు నిజమవుతాయా? లేక డిమోన్ పవన్ సేఫ్ అవుతాడా? అన్నది చూడాలి.