Southwest Monsoon | హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు గురువారం కేరళలోకి ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈనెల 1న కేరళకు రుతుపవనాలు రావాల్సి ఉన్నదని, కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుతో ఆలస్యమైనట్టు పేర్కొన్నది. ఇప్పటివరకు ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు నైరుతితో ఉపశమనం కలుగుతుందని తెలిపింది. నైరుతి రాకతో కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు వివరించింది.
వారంరోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సాధారణ వర్షపాతం 740.6 మి.మీగా, ఏడాది సాధారణ వర్షపాతం 923.8 మి.మీ అంచనా వేసినట్టు తెలిపింది. కాగా, గడిచిన 24గంటల్లో రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని పేర్కొన్నది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో అత్యధికంగా 5.08 సెం.మీ వర్షం కురిసినట్టు పేర్కొన్నది. సూర్యాపేట జిల్లా మోతేలో అత్యధికంగా 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, గతంతో పోలిస్తే నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా ప్రవేశించాయని వివరించింది. మే 26న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేసినా.. ఎల్నినో ప్రభావంతో అంచనాలు తారుమారైనట్టు చెప్పింది. ఎల్నినో ప్రభావంతో జూన్-సెప్టెంబర్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.