Monsoon | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లా ల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అం చనా వేస్తున్నది.
దీని కారణంగా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంటూ, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. పగటి పూట కొంతసేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా.. ఆకాశం మేఘావృతం కా వడంతో క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతుంది. రెండు రోజులు రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.