హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. బుధవారం ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్,నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులలాంబ గద్వాల జిల్లాల్లో గురువారం, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాని తెలిపింది. మూడు రోజులపాటు ఆయాప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.